SEARCH

THIS WEEK'S BHAKTILAHARI POPULAR POSTS

Saturday, June 10, 2017

కథలు - కాశీ విశ్వనాథుని ఆలయం

కథలు -  కాశీ విశ్వనాథుని ఆలయం

కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా.. పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది. వెళ్లి చూడగా.. దానిపై ‘నా భక్తుని కొరకు’ అని రాసి ఉంది. ఈ బంగారు పళ్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు. పళ్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే.. అది మట్టిపాత్రగా మారిపోయింది. విడిచి పెట్టగానే మళ్లీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కో భక్తుడు రావడం.. పళ్లాన్ని ముట్టుకోవడం.. అది మట్టిపాత్రలా మారిపోవడం.. ఇదే తంతు! విషయం కాశీ రాజుకు తెలిసింది. రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్లాడు. జనులందరూ చూస్తుండగా బంగారు పళ్లాన్ని పట్టుకున్నాడు. అది మట్టిపాత్రగా మారిపోవడమే కాదు.. నలుపు రంగులో కనిపించింది. తానెంత అధముడనో రాజుకు అర్థమైంది. అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇంతలో ఓ పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు. మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు. కళ్లు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు. ‘విశ్వనాథా! ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు తండ్రి’ అని మొరపెట్టుకున్నాడు. మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు. ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలనూ ఇచ్చేశాడు. చివరగా ఆలయంలోకి వచ్చాడు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలో పళ్లెం సంగతి తెలిసింది. ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్లాడు. దూరంగా నిల్చుని చూస్తున్నాడు. తిరిగి వెళ్లిపోబోతోంటే.. ఆలయ పూజారి.. ‘ఓ పెద్దాయన.. నువ్వూ వచ్చి ముట్టుకో.. రోజూ గుడికొస్తావ్‌గా, నీ భక్తి ఏ పాటిదో తెలిసిపోతుంది’ అని హేళనగా అన్నాడు. పెద్దాయన వెళ్లి పళ్లెం పట్టుకున్నాడు. అది మరింత బంగారు వన్నెల్లో మెరిసిపోతూ కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అర్చనలు, అభిషేకాల భక్తికి నిదర్శనాలు కాదు. ఆపన్నులను ఆదుకునే తత్త్వం ఉండటమే నిజమైన భక్తి. అలాంటివారే నిజమైన ఆధ్యాత్మికవాదులు.
నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు!
నేను శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.
నేను సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.
నేను ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.
నేను వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.
నేను ఆయన ప్రేమను అడిగాను- భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.
నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.
నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.
నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.
నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను - భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.
నేను పాపాలు క్షమించమని అడిగాను - భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.
అలా జీవితం లో నేను కోరుకున్నదేదీ పొందలేదు - నాకు కావలసిందే నేను పొందాను.
ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.
చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను. మీరు కూడాఅర్ధం చేసుకోండి. జరిగేది అంతా మన మంచికే...లోకా సమస్తా స్సుఖినోభవ౦తు

No comments:

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...